Saturday, 13 July 2019

RITU JAISWAL-POWERFUL SARPANCH-BIHAR




రీతూ జైస్వాల్‌ - Powerful sarpanch
ఊరి సర్పంచ్‌కి పవర్‌ ఉంటుంది.పవరుంటే.. ఊరికి కరెంటొస్తుంది.మంచినీళ్లొస్తాయి. మంచి రోడ్లు పడతాయి.శుభ్రమైన మరుగుదొడ్లు వస్తాయి.అయితే రీతూ జైస్వాల్‌ ఇవన్నీ చేశాకేసర్పంచ్‌ అయ్యారు!సర్పంచ్‌ అవాలని చేయలేదు.‘ఇదా ఊరు!’ అని సర్‌ప్రైజ్‌ అయి చేశారు.అందుకే ఆమె సూపర్‌ సర్పంచ్‌.
‘‘నేను కలలు కన్న భారతదేశ నిర్మాణం కోసం నేను ఎంతగానైనా శ్రమిస్తాను. ఈ విధి నిర్వహణలో నాకు ఎదురైన అడ్డంకులను అధిగమించే వరకు శ్రమించగలిగిన మానసిక శక్తి నాలో ఉంది. అది నా తల్లిదండ్రుల పెంపకంలో నాకు అబ్బిన నైజం. నా వంతు బాధ్యతగా మా ఊరిని బాగు చేస్తాను’’. ఈ మాటలు అన్నది రీతూ జైస్వాల్‌. ఆమె బిహార్‌ రాష్ట్రం, సీతామర్హి జిల్లా, సింగ్‌వాహిని గ్రామ ముఖి... అంటే గ్రామ సర్పంచ్‌ అన్నమాట..

పెళ్లి 1996లో జరిగింది.  కొత్త దంపతులు సొంత ఊరికి వెళ్లారు. భర్త అరుణ్‌కుమార్‌ పూర్వికుల ఊరది. అదే బిహార్‌లోని సింగ్‌వాహిని గ్రామం. ప్రస్తుతం... రీతూ కార్యక్షేత్రం.
నీళ్లు తాగలేకపోయింది
కొత్త కోడలికి అత్తగారింటి బంధువులంతా సాదరంగా ఆహ్వానం పలికారు. ఆమె ఆ గ్రామంలోనే కాదు, అసలు గ్రామంలో అడుగుపెట్టడమే తొలిసారి. విందు భోజనాలు మొదలయ్యాయి. భోజనం వడ్డించి గ్లాసులో నీళ్లు పెట్టారు. నీటిలో నుంచి గ్లాసు అడుగు కనిపించడం లేదు. అదేదో లేత పసుపు రంగు జ్యూస్‌ కావచ్చు అనుకున్నారామె మొదట. తాగడానికి నీళ్లు కావాలని అడిగితే.. ‘ఇవిగో’ అంటూ ఆ గ్లాసును చూపించారు. సింగ్‌వాహిని గ్రామంలో నీళ్లు అలాగే ఉంటాయని అరుణ్‌కుమార్‌కు తెలుసు కాబట్టి అతడికి ఆశ్చర్యపోవడానికేమీ లేదు. కానీ పరిశుభ్రమైన నీటిని ఫిల్టర్‌లో వడపోసి మరీ తాగుతూ పెరిగిన అమ్మాయికి మురికిగా ఉన్న ఆ నీటిని తాగడం కంటే భయంకరమైన పరిస్థితి మరొకటి ఉండకపోవచ్చు. కోడలికి శుభ్రమైన నీరు తాగే అలవాటు ఉందని తెలిసినా అత్తింటి వాళ్లు చేయగలిగిందేమీ లేదు. అప్పట్లో ఇప్పుడు ఉన్నట్లు వాటర్‌ ప్లాంట్‌లు అందుబాటులో లేవు. క్యాన్‌లలో నీటిని తెచ్చుకునే సౌకర్యమూ లేదు. దేశంలో మంచినీటి వ్యాపారం మొదలైనప్పటికీ మారుమూల గ్రామాలకు చేరని రోజులు. ఆ చేదు జ్ఞాపకంతోనే భర్తతోపాటు ఢిల్లీకి చేరారామె.
 ‘‘ఊరి కోసం ఏదైనా చేయాలనే ఆకాంక్ష మాత్రమే ఉంటే సరిపోదు. దానికోసం మనకు చేతనైన ప్లాన్‌ ఒకటి తయారు చేసుకోవాలి. అందుకోసం ఊరిలో అన్ని వీధులూ, నాలుగు మూలలా తిరిగి చూశాను. శ్రామిక వాడల్లో స్త్రీలతో మాట్లాడాను. వాళ్లకేం కావాలో తెలుసుకోవడానికి వాళ్లను ఇంటికి పిలిచేదాన్ని. వాళ్లు చెప్పినవన్నీ రాసుకునేదాన్ని. అందులో నుంచి ఏయే డిపార్ట్‌మెంట్‌లతో మాట్లాడాల్సిన వాటిని విడిగా లిస్ట్‌ అవుట్‌ చేసుకునే దాన్ని. అలా ఆ మహిళలు నాతో చాలాసేపు మా ఇంట్లోనే ఉండేవాళ్లు. వాళ్లేం తింటున్నారనే సంగతి నుంచి ప్రభుత్వ పథకాలు వాళ్లకు ఎంత వరకు చేరుతున్నాయనే వివరాలు కూడా నాకు తెలుస్తుండేవి. నేను ఏ మాత్రం ఊహించని షాక్‌ ఏమిటంటే.. ఓ రోజు ఇంట్లో మేము కూర్చున్న గది కాకుండా మరో గదిలో మూలన వెలుగుతున్న స్టాండ్‌ లైట్‌ను ఆపేయమని ఒకామెతో చెప్పాను. ఆమె నోటితో ఊదింది. వాళ్లకు కరెంటు లేకపోవడం కాదు నన్ను ఆశ్చర్యపరిచింది, కరెంటు లైట్‌ వేయడానికి ఆపేయడానికి స్విచ్‌ ఉంటుందని కూడా తెలియకపోవడం నన్ను కలచి వేసింది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఇదేనా అని కూడా అనిపించింది’’ అన్నది రీతూ ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదనగా.
ఊరిని ఏకం చేసింది
బిహార్‌ను తరచూ వరదలు అతలాకుతలం చేస్తుంటాయి. గత ఏడాది వరదలు రాష్ట్రంలో వందలాది ప్రాణాలను హరించాయి. కోటి మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆ వరదలు సింగ్‌వాహిని గ్రామాన్ని కూడా కదిలించి వేశాయి. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యల కోసం ఎవరైనా ప్రభుత్వం వైపే చూస్తారు. రీతూ జైస్వాల్‌ ప్రభుత్వ అధికారుల బృందం వచ్చే వరకు ఎదురు చూడకుండా కార్యరంగంలో దిగారు. దారి తప్పి వచ్చిన వాళ్లకు షెల్టర్‌ ఏర్పాటు చేశారు. వాళ్లను ఊరి అతిథులుగా ఆదరించాలని చెప్పి ఊరి వాళ్లను ఏకం చేసి వాళ్లకు సహాయం చేసే బాధ్యత పురమాయించారు. ప్రతి ఇంటి నుంచి ఆ ఇంటి వాళ్లతో పాటు మరొకరికి భోజనం వండాలి. ఆ భోజనం ఊరి అతిథుల కోసం. కొందరు యువకులతో సర్వీస్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆ సర్వీస్‌ టీమ్‌లోని యువకులు ఇంటింటికీ వెళ్లి అతిథి భోజనాన్ని సేకరించి షెల్టర్‌లో ఉన్న వాళ్లకు అందించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందని ఎదురు చూడడం, ప్రభుత్వమే చేయాలని ఆశించడం, సరిగ్గా చేయలేదని ఆరోపించడం కాదు. మనం ఏం చేయగలమో అంత మేర చేయడానికి సిద్ధం కావాలి’’ అని చెప్పారామె.
ఆదర్శ సారథ్యం
రీతూ జైస్వాల్‌ ‘ఉచ్ఛ శిక్షిత్‌ ఆదర్శ్‌ యువ సర్పంచ్‌ పురస్కార్‌ 2016, చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ అవార్డ్‌ 2018’ అవార్డులు అందుకున్నారు. వీటితోపాటు ఆమె... బిహార్‌ పంచాయత్‌ రాజ్‌ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘కెపాసిటీ బిల్డింగ్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ సర్పంచ్‌ అండ్‌ పంచాయత్‌ సెక్రటరీస్‌’ ప్రోగ్రామ్‌ కు ఎంపిక చేసిన ఐదుగురు ప్యానలిస్టుల్లో రీతూ ఒకరు. పెట్రోలియం అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ రాంచిలో నిర్వహించిన ‘ఎల్‌పీజీ, కేటలిస్ట్‌ ఆఫ్‌ సోషల్‌ చేంజ్‌–2’ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పట్నాలో ‘బాలికలు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల్లో నమోదు కాకుండా ఉండిపోతున్న పరిస్థితులు – పెరుగుతున్న నేరాల సంఖ్య’ అంశం మీద జరిగిన సదస్సులో ప్రసంగించారు.
కల నెరవేరింది
‘‘
ఊరికి మొదటగా సురక్షితమైన తాగు నీరు కావాలి, మంచి రోడ్లు కావాలి, టాయిలెట్‌లు కావాలి. వీటిని సాధించడం ఎలాగో తెలియదు కానీ, సాధించగలననే నమ్మకంతో ఈదడం నేర్చుకోకనే ఈ సముద్రంలో దూకేశాను. ఊరి సమస్యల జాబితా పట్టుకుని సీతామర్హి కలెక్టర్‌ను కలిశాను. ప్రతిసారీ ఊరి వాళ్లను కనీసం నలుగురైదుగురిని అయినా నాతోపాటు తీసుకెళ్లేదాన్ని. బయటి నుంచి వచ్చిన నేను చెప్పడం కంటే సమస్యను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాళ్లు చెబితేనే సమస్య తీవ్రత అర్థమవుతుంది. కలెక్టర్‌ సహకారంతో పాతిక హ్యాండ్‌ పంపులు ఒక్కొక్కటి 250 అడుగుల లోతులో వేశాం. గ్రామంలో రెండు వేల రెండు వందల టాయిలెట్‌లు కట్టించాం. ప్రధానమైన రోడ్లు పూర్తయ్యాయి. చిన్న రోడ్ల నిర్మాణం జరుగుతోందిప్పుడు. ఈ ఐదేళ్లలో ఊరి ముఖచిత్రం మారిపోయింది. 2016లో పంచాయితీకి ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామస్థులు పట్టుపట్టడంతో సర్పంచ్‌గా నామినేషన్‌ వేశాను. ఊరి వాళ్లు నాతో గ్రామానికి పనిచేయించుకున్నట్లే ఎన్నికల్లో కూడా నన్ను గెలిపించుకున్నారు. అప్పటి నుంచి నా బాధ్యత పెరిగింది. ఢిల్లీకి– సింగ్‌ వాహినికి మధ్య దూరం వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉంటుంది. 2014 నుంచి పదహారు మధ్యలో లెక్కలేనన్ని సార్లు ప్రయాణం చేశాను. ఇప్పుడు నెలలో ఎక్కువ రోజులు సింగ్‌వాహినిలోనే ఉంటున్నాను. ఢిల్లీ నుంచి మా ఊరికి చక్కటి రోడ్ల మీద వస్తుంటే నా ప్రయాణాలు వృథా కాలేదనిపిస్తుంటుంది. ఊరంటే ఎలా ఉండాలని నేను కోరుకున్నానో అలా ఉంది మా ఊరు. నా కోరిక తీరినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు 42 ఏళ్ల రీతూ జైస్వాల్‌.
-సాక్షి నుండి