జ్ఞానపీఠ్ అవార్డు
ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డుకు ప్రముఖ రచయిత శ్రీ రావూరి భరద్వాజ ఎంపికయ్యారు. రావూరి ‘పాకుడు రాళ్ళు’
నవలకు ఈ అవార్డు లభించింది. ఈ ’పాకుడు రాళ్ళు’ నవలలో సినీ ప్రపంచ లోతుపాతుల గురించి చర్చించారు.
జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందిన తెలుగువారిలో రావూరి మూడోవారు. ఆయక కంటే ముందు విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణరెడ్డి జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్నారు.
1927 జులై 5న పరిటాల జాగీరులోని మోగులూరు గ్రామం(ఇప్పటి కృష్ణాజిల్లా నందిగామ తాలుక)లో జన్మించిన రావూరి భరద్వాజ 130 గ్రంధాలు వెలువరించారు. కథా రచయితగా ఆయన అపార కీర్తి నార్జించిన ఆయన మొత్తం 24 కథాసంపుటాలు వెలువరించారు. వాటిలో సామాన్యుల సమస్యల నుంచి వియత్నాం దక్షిణాఫ్రికా విముక్తి పోరాటాల వరకూ ప్రతిబింబిస్తాయి. తొమ్మిది నవలలు రాయగా అందులో సినీలోకపు మేడిపండు రూపం చిత్రించిన పాకుడు రాళ్లు గొప్ప పేరు తెచ్చింది. కాదంబరి మరో విధంగా విశిష్టత సంతరించుకుంది. బాల సాహిత్యం విస్తారంగా వెలువరించడమే గాక వినువీధిలో వింతలు వంటి వైజ్ఞానిక రచనలు అందించారు. వివిధ వృత్తుల వారి బతుకు పోరాటానికి అద్దం పట్టిన జీవన సమరం ఆయన రచనలలో అత్యున్నత గౌరవం పొందింది.
'ఇనుప తెర వెనక' పేరిట నాటి సోవియట్ యూనియన్‌పై సాగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ సామ్యవాద సమాజ దృశ్యాన్ని ఆవిష్కరించారు. రావూరి భరద్వాజ రచనల్లో భాష జన జీవితానికి దగ్గరగా వుంటుంది. ఆయన నిత్య జీవితంలోనూ చాలా నిరాడం బరంగా స్నేహశీలంగా మెలుగు తుంటారు. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో అనేక పురస్కారాలు పొందడమే గాక రచయితగానూ విశేషమైన ప్రఖ్యాతి పొందినా సాహిత్య సభలకు అందరితో పాటు హాజరయ్యే వినమ్రత ప్రదర్శిస్తారు. వామపక్ష సాహిత్య సంస్థల పత్రికల సభలకు హాజరై సౌహార్ద్రత చాటుతారు. ఆయన రచనల్లో అత్యధికం విశాలాంధ్ర ప్రచురించింది.
భరద్వాజ జూలై 5,1927లో నాటి హైదరాబాద్ రాష్ట్రం క్రిష్ణా జిల్లా మొగు లూరులో రావూరి సుబ్బయ్య, మల్లికాంబ దంపతులకు జన్మించారు. కొంతకాలం తర్వాత వారి కుటుంబం గుంటూరు జిల్లా తాటికొండూరుకు వలసవెల్లింది. రెండవ ప్రపంచ యుద్దసమయంలో టెక్నీషియన్‌గా పనిచేసిన భరద్వాజ అనంతర కాలంలో అనేక ఉద్యోగాలు చేశారు. 1946లో నాటి ప్రముఖ వార పత్రిక జమీన్ రైతు సంపాదకవర్గంలో సభ్యులుగా చేరారు. 1948లో నెల్లూరు నుంచి వెలువడే దీన బందు వారపత్రికకు బాధ్యులుగా పనిచేశారు. జ్యోతి,సమీక్ష, అభిసారిక, చిత్రసీమ, సినిమా, యువ పత్రికల్లో 1959వరకు పనిచేసిన భరద్వాజ అదే సంవత్సరం ఆల్ ఇండియా రేడియోలో జూనియర్ స్క్రిప్టు రచయితగా చేరారు. రేడియోలో ప్రసారమైన వాడుక పదాలు కార్యక్రమానికి 1975లో బాధ్యులుగా నియమితులయ్యారు. అవే బాధ్యతల్లో 1987లో పదవీ విరమణ చేశారు.
ఆయన రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు వారిని రెండు సార్లు వరించింది. 1968,83లో వారికి ఈ అవార్డు ప్రధానం చేశారు. 1983లోనే భరద్వాజ జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 8వ తరగతివరకే విద్యనభ్యసించిన భరద్వాజకు రాష్ట్రంలోని 3 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లు ప్రకటించటం విశేషం. ఆంధ్రా, నాగార్జున, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్‌లతో సత్కరించాయి. 2009లో లోక్‌నాయక్ ఫౌండేషన్ లిటరరీ అవార్డు ఆయనను వరించింది. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించిన భరద్వాజను ఇంకా అనేక అవార్డులు వరించాయి. విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ సి.నారాయణరెడ్డి తర్వాత జ్ఞానపీఠ్ అవార్డును పొందిన తెలుగు రచయితల్లో భరద్వాజ మూడో వ్యక్తి.