Saturday, 13 June 2015

Know the difference between chest pain and heart attack


ఛాతీ నొప్పికి... గుండెపోటుకు తేడా తెలుసుకోండి

Sakshi | Updated: June 10, 2015 22:37 (IST)
ఛాతీ నొప్పికి... గుండెపోటుకు తేడా తెలుసుకోండి
లైఫ్ అండ్ డెత్

గుండెపోటు లక్షణాలూ, గ్యాస్ పైకి తన్నినప్పుడు కలిగే ఛాతీనొప్పి ఇంచుమించూ ఒకేలా ఉంటాయి. పైగా గ్యాస్‌తో కలిగే ఛాతీనొప్పికి ఇంగ్లిష్ పేరు ‘హార్ట్ బర్న్’ అని. దాంతో ఏది ప్రమాదకరమైన గుండెపోటో, ఏది అంతగా ప్రమాదం కలిగించని గ్యాస్ సమస్యో తెలియక కొందరు తికమకపడుతుంటారు. కొందరు ప్రమాదకరమైన గుండెపోటును సైతం ‘ఆ... అంతా గ్యాసేలే’ అంటూ లైట్‌గా తీసుకుంటుంటారు. అందుకే అది ప్రమాదం కాని గ్యాస్ సమస్యే అయినా, ప్రమాదకరమైన గుండెపోటుగా కాసేపు అనుకున్నా తప్పులేదు. ఇలా ఎందుకు అనుమానించాలంటే...  గుండెపోటు ప్రమాదం భారతీయుల్లో చాలా ఎక్కువ. కారణం మన జన్యువులే. ఇతర దేశాల్లో వయోవృద్ధులకు వచ్చే గుండెపోటు ముప్పు మన దేశంలో పాతికేళ్లకే ఎదురవుతోంది. మూడు పదులు దాటకముందే గుండెకు రక్తాన్ని అందించే మూడు ప్రధాన రక్తనాళాలు పూడుకుపోతున్నాయి. ముందున్న ఈ ముప్పును గుర్తుంచుకొని గుండెపోటును గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం...

గుండెపోటు ఇస్తుంది వార్నింగ్...: గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు ఉన్నా... కొన్ని లక్షణాలను ముందస్తు హెచ్చరికలా  పంపుతుంది. దాంతో మనం ముందుగానే గుండెపోటును అనుమానించవచ్చు. కొన్నిసార్లు గుండెపోటు రావడానికి చాలా గంటల ముందునుంచే మనకు ఈ హెచ్చరికలు అందుతుంటాయి.

ఇవీ గుండెపోటు లక్షణాలు... :  ఛాతీకి ఎడమవైపున నొప్పితో పాటు బరువుగా ఉన్నట్లు అనిపించడం  ఊపిరాడని పరిస్థితి  మగత  చెమటలు పట్టడం  వాంతులు  కొందరిలో దగ్గుతో పాటు నోటి నుంచి రక్తం కూడా రావచ్చు.  గుండెనొప్పికీ, గుండెపోటుకీ మధ్య కూడా తేడా ఉంటుంది. ఛాతీ నొప్పి ఉండే కాల వ్యవధిని బట్టి ఆ తేడాను గుర్తించవచ్చు.  ఛాతీనొప్పి మొదలైన మూడు నిమిషాల్లో దానికదే తగ్గిపోతుంది. అలా మూడు నిమిషాల్లో ఆగిపోకుండా, నొప్పి పది నిమిషాలకు పైగా కొనసాగుతూ ఉంటే దాన్ని గుండెపోటుగా అనుమానించాలి.

గుండెపోటు ఎందుకు వస్తుందంటే : గుండెకు రక్తప్రసరణ అకస్మాత్తుగా నిలిచిపోతే ఆకస్మికంగా గుండెపోటు వస్తుంది. గుండె రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు తలెత్తితే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. భారతీయుల్లో సాధారణంగా 25 ఏళ్ల వయసులోనే మంచి రక్తం అందించే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే లక్షణాలు మొదలవుతున్నాయి. రక్తనాళాల్లో కొవ్వు గడ్డలుగా పేరుకుపోతూ రక్తప్రసరణకు ఆటంకం కలిగినప్పుడు ఆకస్మికంగా గుండెపోటు వస్తుంది. ఇది ఎప్పుడైనా జరగవచ్చు.

గుండెపోటో - గ్యాస్ సమస్యో తెలియని తికమక : సాధారణంగా చాలామంది గుండెపోటును గ్యాస్ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. వాస్తవానికి మీరు అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్‌కిల్లర్ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ ఇలా ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనంగా లేదని భావిస్తే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాలి. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో నొప్పితో పాటు తీవ్రమైన అసౌకర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఛాతీ మెలిపెడుతున్నట్లుగానూ, బరువు పెట్టినట్లుగా, ఒత్తిడి పడ్డట్లుగా ఉంటుంది. నొప్పి ఛాతీమొత్తం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి చాలాసార్లు కండరాలకు సంబంధించిన నొప్పిలా, జీర్ణసంబంధ నొప్పి కూడా ఇలాగే అనిపిస్తూ తికమకపెడుతుంటుంది. రెండింటికీ తేడా ఏమిటంటే... గుండెనొప్పి ఒకసారి వస్తే అది కొనసాగుతూ ఉంటుంది. అందే కండరాలు లేదా జీర్ణకోశ నొప్పులైతే వస్తూపోతూ ఉంటాయి. అందువల్ల గుండెపోటును గ్యాస్ సమస్యగా తికమకపడకుండా దాని లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కోసారి నొప్పి ఛాతీలో కాకుండా చంకల నుంచి మెడ, దవడలు, పొట్ట, దంతాల నుంచి కూడా మొదలుకావచ్చు.

మొదటి గంట... బంగారు క్షణాలు: గుండెపోటు లక్షణాలు బయటపడ్డ మొదటి గంట వ్యవధిని బంగారు క్షణాలుగా అభివర్ణించవచ్చు. ఇంగ్లిష్‌లో దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆ సమయంలో రోగిని ఆసుపత్రికి చేర్చగలిగితే అతడిని తప్పక రక్షించవచ్చు. అందుకే ఆ క్షణాలకు అంత విలువ. ఈ ఒక్క గంటే చావుబతుకుల మధ్య తేడాను నిర్ణయిస్తుంది. సాధారణంగా కొందరు రోగులు గుండెపోటు లక్షణాలు చాలా తేలిగ్గా తీసుకుంటారు. తమకు అప్పుడప్పుడూ కనిపించే గ్యాస్ తాలూకు లక్షణాలుగా అపోహ పడతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ... ఛాతీనొప్పిని గుండెపోటుగా అనుమానించి ఆసుపత్రికి వెళ్లినా... రోగి క్షేమంగా తనకు అవసరమైన గ్యాస్ సమస్యకే చికిత్స తీసుకొని బయటకు వస్తాడు. కానీ ఒకవేళ... అది నిజంగానే గుండెపోటు అయి ఉండి, గ్యాస్ సమస్యగా అపోహ పడితే దానికి చెల్లించే మూల్యం చాలా భారీగా ఉండవచ్చు. మన మధ్య నుంచి ఒక వ్యక్తి అన్ని వసతులూ ఉండి జారిపోవచ్చు. అందుకే గ్యాస్ సమస్యనూ గుండెపోటుగానే అనుమానించి, నిర్ధారణ కోసం ఒక ఈసీజీ పరీక్ష తీయించడంలో తప్పేమీ లేదు. తప్పేది ముప్పు మాత్రమే.

గుండెపోటు వచ్చినప్పుడు ముందుజాగ్రత్తలివే...: గుండెపోటు వచ్చినట్లు అనుమానించిన వెంటనే రోగి చేత కొద్దిగా నీళ్లు తాగించాలి. ఆసుపత్రికి చేరుకునేలోగా అతడు విపరీతంగా దగ్గేలా ప్రోత్సహించాలి. 325 మి.గ్రా. డిస్ప్రిన్, 300 మి.గ్రా. క్లోపిడోగ్రెల్, 80 మి.గ్రా. స్టాటిన్ టాబ్లెట్లను మింగించాలి. దీనివల్ల ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక రోగి శరీరంపై బిగుతుగా ఉన్న దుస్తులను వదులు చేయాలి. అవసరమైతే కృత్రిమశ్వాస అందించాలి. రోగి శరీరానికి ఏమాత్రం శ్రమ కలగకుండా ఏదైనా వాహనంలో తక్షణం ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అంతేగానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రోగి గుండెపై భారం పడేలా నడిపించడమో, మెట్లు ఎక్కించడమో చేయకూడదు.
 ఇలా చేయడం వల్ల మనం ఎందరివో అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చు.

తీవ్రతలో రకాలు...: గుండెపోటు వచ్చిన సమయంలో నొప్పి తీవ్రత రకరకాలుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో నొప్పి తీవ్రంగానూ, భరించలేనంతగా ఉంటుంది. ఛాతీలో అసౌకర్యం 15 నుంచి 30 నిమిషాలపైనే ఉంటుంది. దీనికి సంబంధించిన మూడు ప్రధాన లక్షణాలు ఇలా ఉంటాయి. 1. నొప్పి వస్తున్న ప్రాంతం 2. నొప్పి స్వభావం 3. నొప్పి తీవ్రమవుతూ, తగ్గుతూ ఉండటం.

 డాక్టర్ గణేష్ మాథన్
 సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్

 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.