శక్తి స్వరూప
తలవంచకుండా ఉండటం అన్నది స్వభావం. తలదన్నేవాడొచ్చినా, తల తెగిపడినా తలదించకుండా ఉండటం స్వభావం. సివంగి తలదించదు. నాలుగు సింహాల్లో అరుదుగా కనపడే ఒక సివంగి రూపా మొద్‌గిల్. ఆడపిల్లలు ఐపీఎస్ చేయడం తక్కువ.అందుకే ఐపీఎస్‌లలో మహిళలు తక్కువే. ఆ తక్కువలో అతి అరుదు రూప. తను నమ్మిన సిద్ధాంతానికి... భారత రాజ్యాంగం తనకిచ్చిన శక్తిని కలుపుతూ, ఖాకీటోపీని కిరీటంలా ధరించింది. ఎస్! రూపా మొద్‌గిల్.
‘అమ్మా.. నేను పెద్దాయ్యాక ఏమవ్వాలి?’అమాయకంగా అడిగింది ఓ అయిదేళ్ల పాప వాళ్లమ్మను. ఆ పాప బుగ్గ మీద ముద్దుపెట్టుకుంటూ ‘డాక్టర్ కావాలి’ అని చెప్పింది అమ్మ. ఆమె చేతుల్లోంచి తుర్రుమని పారిపోయి నాన్న ఒళ్లో కూర్చుని అడిగింది ‘నేను పెద్దయ్యాక ఏమవ్వాలి?’ అని.చదువుతున్న న్యూస్ పేపర్‌ను పక్కన పెట్టేసి.. ‘ఎందుకు నాన్నా..’ ముద్దుచేస్తూ అడిగాడు తండ్రి. ‘రేపు మా టీచర్ చెప్పమంది’ అన్నది ఆ పాప. ‘పోలీస్ ఆఫీసర్ అవుతానని చెప్పు’ పాపను గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ సమాధానం ఇచ్చాడు కూతురికి. ‘యెస్ నాన్నా..’ కిందకి దింపగానే సెల్యూట్ చేస్తూ చెప్పి పరిగెత్తి పోయింది.మరుసటిరోజు బడిలో.. టీచర్‌కు చెప్పింది.. ‘నేను పెద్దాయ్యక పోలీస్ ఆఫీసర్ అవుతా’ అని. ఇంక ఆ రోజుకి ఆ మాట అప్పచెప్పేసి మరిచిపోలేదు ఆ అమ్మాయి.
నాన్న చెప్పిన మాటను ఓ మంత్రంలా జపించింది. ఓ తపస్సులా భావించింది.ముప్పైఏడేళ్లు గడిచాయి... ఇటీవల...బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో.. జయలలితకు అత్యంత సన్నిహితురాలు, ఏఐఏడిఎమ్‌కే నేత ‘శశికళ ఒక ఖైదీలా కాకుండా.. కోర్టు తీర్పుకి, ఆర్డర్‌కు వ్యతిరేకంగా సర్వభోగాలు అనుభవిస్తోంది... తనకు నచ్చిన వంటకాలను చేయించుకుని తింటోంది..’ అని చెప్పడమే కాక.. సాక్ష్యంగా వీడియో క్లిప్పింగ్స్‌ను చూపించింది ఓ పోలీస్ ఆఫీసర్. ‘శశికళ ఇలా సొంత కిచెన్ మెయిన్‌టైన్ చేసుకునేలా డీజీపి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జైళ్లు) సత్యనారాయణ రావు ఆమె దగ్గర రెండుకోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు’ అన్న రిపోర్టూ ఇచ్చింది. ఈ విషయం అన్ని భాషల వార్తాపత్రికల్లో, అన్ని టీవీ చానళ్లలో ప్రధాన వార్త అయింది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్‌ను బదిలీ చేసేశాడు.. డిఐజీ (డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, జైళ్లు)గా ఉన్న ఐపీఎస్‌ను ఐజీగా, ట్రాఫిక్ అండ్ రోడ్‌సేఫ్టీ కమీషనర్‌గా బదిలీ చేశారు.
‘ప్రభుత్వ అధికారులను బదిలీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. బదిలీలు నాకు కొత్త కాదు.. నా పదిహేడేళ్ల సర్వీసులో యేడాదికి రెండు ట్రాన్స్‌ఫర్స్ అవుతూనే ఉన్నాయి’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చింది ఆ పోలీస్ ఆఫీసర్!ఈ ఐపీఎస్ సంచలనం ఎవరో కాదు.. చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అవుతానని చెప్పిన చిన్నారే.కర్నాటక కేడర్ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి.. దివాకర్ రూపా మొద్‌గిల్. ఇప్పుడు వార్తల్లో ఉన్న వ్యక్తి.అన్యాయం చేస్తున్న వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా ఆమె లెక్క చేయరు. సాక్ష్యత్తూ ముఖ్యమంత్రి అయినా.. తన ఇమ్మిడియెట్ బాస్ అయినా.. తన సబార్డినేట్ అయినా.. చివరకు పరాయి రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా సరే.. కళ్ల ముందు అన్యాయం కనిపించినా.. న్యాయస్థానం ఆర్డరేసినా.. ఆ తీర్పులకు, కర్తవ్యానికి కట్టుబడి ఉంటుంది. సంకెళ్లు వేసేస్తుంది. అందుకే ఆమె కన్నడ అమ్మాయిలకు ఆదర్శం.. యూత్‌కి ఆరాధన, స్ఫూర్తి! సీనియర్ సిటిజన్స్‌కు ముచ్చట. కిరణ్‌బేడీ లాంటి వెటరన్ పోలీస్ ఆఫీసర్స్‌కు ఉత్సాహం! కాబట్టే.. ‘రూపలాంటి ఆఫీసర్స్ మరింత మంది కావాలి.. రావాలి’అంటూ కితాబూ ఇచ్చారు.
మిస్ దావణగేరె.. ఐపీఎస్
చదువు, అందం, కళలు... ఈ మూడు ఆమెకు రెండుసార్లు మిస్ దావణగెరె కిరీటాన్ని పెట్టాయి. మిస్ దావణగెరె అనే ఆ కిరీటం ఆమెకు కొత్త కెరీర్ అవకాశాలనే తెచ్చిపెట్టింది. కాని రూప మనసు మార్చుకోలేదు. లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. సైకాలజీ, సోషియాలజీ ఐచ్ఛికాలుగా సివిల్స్‌కు ప్రిపేర్ అయింది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే 43వ ర్యాంకుతో సివిల్స్ సాధించింది. ఆ ర్యాంక్‌తో ఆమెకు ఐఏఎస్సే వచ్చేది ఈజీగా. రూప దరఖాస్తు చేసుకుంది ఐపీఎస్‌కే. అలా 2000లో ఐపీఎస్ అయింది దివాకర్ రూపా మొద్‌గిల్.
ఐపీఎస్ కావాలనే కల కన్నప్పుడు, ఆ కలను నెరవేర్చుకోవడానికి కష్టపడుతున్నప్పుడు, నెరవేరాక కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైనప్పుడూ.. ఎందుకు ఐపీఎస్ కావాలనుకుందో ఆ ఆశయాన్ని మర్చిపోలేదు. శాంతిభద్రతలను కాపాడి, కళ్లముందు జరుగుతున్న అన్యాయాలను కట్టడి చేయాలన్న మాటను మరుగున పర్చలేదు. ఈ ప్రయాణంలో ముఖ్యమంత్రులు, నేతలు, అధికారులు, గుమాస్తాలు ఎవరు ఎదురైనా.. ఒకటే తీరుగ స్పందించింది.
బ్రేవో రూపా!
Taken from Sakshi paper